29, మార్చి 2024, శుక్రవారం

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు, అన్నప్రసాడం, తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి, మలహోరా, మిరియాల ప్రసాదం, నేతి పొంగలి, జిలేబి, మురుకులు ,లడ్డూ, వడ, పాయసం, బొబ్బట్లు అబ్బో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో. అయితే ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో. ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పించినా ఆ వెంకటేశ్వరునికి మాత్రం వీటన్నిటి కంటే ఒక్క నైవేద్యం మాత్రం అత్యంత ప్రీతిపాత్రమైనడట. అందుకే ఈ నైవేద్యాలన్నీ కులశేఖర పడి దగ్గరనుంచే శ్రీనివాసునికి సమర్పిస్తే ఈ ఒక్క నైవేద్యం మాత్రమె కులశేఖర పడి దాటి శ్రీనివాసుని సన్నిధిలో స్వామికి నివేదన చేస్తారట. మరి ఆ ఒక్క నైవేద్యం ఏంటి. ఆ నైవేద్యానికి ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాం..



         తిరుమల వేంకటేశ్వరునికి ''ఓడు'' అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని ''మాతృ దద్దోజనం'' అంటారు 

                ఓడు అంటే పగిలిన మట్టి కుండా అని అర్థం. ఆ పగిలిన మట్టికుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు. కలియుగ ప్రత్యక్షదైవం, లక్ష్మీవిభుడు, అత్యంత ధనవంతుడైన శ్రీ వేంకటేశ్వరునికి పగిలిన కుండలో నైవేద్యమా... ఆశ్చర్యంగా ఉంది కదూ... అవును పగిలిన మట్టికుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు... ఎందుకలా! సాక్షాతూ లక్ష్మీవల్లబుడైన శ్రీవారికి వెండి బంగారాలకు కొదవా... మణిమాణిక్యాలకు కొదవా... మరి ఆ శ్రీవారికి  పగిలిన కుండలో  పెరుగన్నం సమర్పించాడమేంటి? ఆ నైవేద్యం శ్రీవారికి అంట ప్రీతిపాత్రమైనదెలా అయింది... ఆ కారణమేంటి? చూద్దాం...

          తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి ప్రియమైనభక్తుడు… వేంకటేశ్వరుని మామగారైన ఆకాశారాజుకి తమ్ముడు.  శ్రీ వేంకటేశ్వరునికి చిన్న మామగారు. శ్రీవారిని నిత్యం బంగారు పూలతో అర్చించేవాడు. అయితే తొండమానుడికి, తానే శ్రీవారికి గొప్ప భక్తుడినని విపరీతమైన గర్వం ఉండేది. ఇలాంటి సమయంలోనే తాను బంగారు పుష్పాలు పెట్టి స్వామికి పూజ చేసి వెళ్ళిపోయేవాడు. అయితే తాను మళ్ళీ స్వామి పూజకు వచ్చేసరికి స్వామి దగ్గర తాను పూజించిన బంగారు పుష్పాలకు బదులు మట్టి పుష్పాలు కనిపించేవి. ఏంటీ విపరీతం ... తాను బంగారు పుష్పాలతో పూజ చేస్తే ఈ మట్టిపూలు ఎలా వస్తున్నవి అని చింతించాడు.

      అయితే శ్రీవేంకటేశ్వరుడు ఓ రాజా! ఇవి నిస్వార్ధంతో, నిష్కలంకమైన భక్తితో పూజించే కుమ్మరి భీమన్న సమర్పించిన పుష్పాలు అని చెప్పాడు. అతని నిష్కళంకమైన భక్తి కారణంగా మట్టి పుష్పాలైనా అవి నా చెంతకు చేరాయి అని చెప్పాడు.

ఆ కుమ్మరి నాకంటే భక్తుడా! నేను సమర్పించే స్వర్ణ పుష్పాలను కూడా పక్కక్ నెట్టేవిధంగా నాకంటే గొప్ప భక్తుడా!  అని అహంకారంతో అడిగాడు తొండమాన్ చక్రవర్తి.  సరే అతని భక్తిని నువ్వే స్వయంగా చూడు అని కుమ్మరి భీమన్న ఇంటికి తొండమాన్ ని తీసుకొని వచ్చారు శ్రీవారు. వారిని చూసి సాదరంగా ఆహ్వానించాడు భీమన్న. ఆ కుమ్మరి భీమన్న నిత్యం శ్రీవారి కైంకర్యాలు కొరకు కుండలను అందించేవాడు. నిత్యం స్వామి సన్నిధికి వెళ్లి పుష్పాలతో అర్చించే సమయం అవకాశం లేని కుమ్మరి భీమన్న, తన వృత్తి పని చేసుకుంటూనే తాను పని చేసుకుంటున్న చోటే స్వామి వారి ప్రతిమను ఏర్పాటు చేసుకొని తన ఇంటివద్దనే పూజించేవాడు. కుండలు తయారుచేయ్యగా మిగిలిన చేతికంటిన మట్టితో పుష్పాలను చేసి స్వామికి అర్పించేవాడు.  అతని భక్తి కారణంగా ఆ మట్టి పుష్పాలు శ్రీవారి ఆలయంలో స్వామి సన్నిధికి  చేరేవి.

          తన ఇంటికి వచ్చిన శ్రీవారికి తన శక్త్యానుసారం  ఒక కుండపెంకు లో పెరుగన్నం సమర్పించాడట కుమ్మరి భీమన్న. ఆ నివేదన తనకెంతో ఇష్టమైనదిగా భావించారట స్వామివారు. దాంతో కుమ్మరి భీమన్న శ్రీవారికి సమర్పించిన నైవేద్యానికి సూచనగా  ఓ కుండను తీసుకోని మీద భాగం వరకు పగులగొట్టి… క్రింది భాగంలో ఆకూ వేసి ప్రసాదాలు వడ్డించి… కుండ మెడభాగాన్ని క్రింద ఉంచి నివేదన చేసే వారు. కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులలో గంగాళాలు అందుబాటులోకి రావడంతో ఓడు వినియోగం తగ్గింది. కానీ ఇప్పటికే కూడా  శ్రీవారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని మాత్రం ఓడు ప్రసాదంగానే పిలుస్తారు. స్వామి వారికి ఇంత ప్రీతిపాత్రమైన నైవేద్యం కాబట్టే మిగిలిన అన్ని ప్రసాదాలు కులశేఖర పదికి ఈవలె పెట్టి స్వామికి నివేదన చేస్తే ఈ ఓడు నైవేద్యం మాత్రం స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది. ఇదీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఓడు నైవేద్యం వెనకున్న కథనం.

 

 

 

తిరుపతిలో ఈ ప్రదేశం చూడకపోతే చాలా మిస్సవుతారు / If you don't see it in tirupati you will miss it a lot

 

     తిరుపతిలో ఈ ఆలయాన్ని చూడకపోతే మీరు చాలా మిస్సవుతారనే చెప్పాలి. ఈ ఆలయంలో శివుని డమరుక శబ్దం, ఓంకారం వినిపిస్తుందట. అక్కడే ఇరవై అడుగుల ఎత్తునుండి హోరుమంటూ దూకే జలపాతం, గలగలమంటూ ఉరికే గంగమ్మ తల్లి తొలిసారి భగీరథుని కోరిక మీద శివుని ఝటాఝూటం నుంచి ఉరుకుతూ, దుముకుతున్న గంగమ్మను కళ్ళముందు నిలిపే దృశ్యం. పాతాళం నుంచి భూమిని చీల్చుకొని వచ్చిన శివలింగం. శ్రీమన్నారాయణుని అంశతో పుట్టిన కపిల మహర్షి తపస్సు చేసిన స్థలం... శివ, కేశవ అబేధాన్ని చాటే ఆలయం... ఇటు ఆధ్యాత్మిక విశేషాలు, అటు ప్రకృతి అందాలు కలగలిసిన అద్భుత ఆలయ విశేషాలు తెలుసుకుందాం..



      వైష్ణవ క్షేత్రాల ప్రసక్తి రాగానే ముందుగా జ్ఞాపకం వచ్చే ఆలయాలలో ముందువరుసలో ఉంటుంది తిరుపతి క్షేత్రం. అక్కడ ప్రతి ఆకూ, పువ్వూ, కొమ్మ, రెమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే అణువణువూ వేంకటేశ్వరుడే. ప్రపంచ ప్రసిద్దిచెందిన తిరుమల. కొండమీద వెంకన్న. కొండ కింద శివయ్య. తిరుపతి అనగానే వెంటనే మన కళ్ళముందు మెదిలేది శ్రీవెంకటేశ్వరస్వామి దివ్యదర్శనం ఒకటయితే రెండవది ఇరవై అడుగుల ఎత్తునుండి హోరుమంటూ దుముకుతూ చూపు తిప్పుకోనివ్వని కపిలతీర్థం జలపాతం. కపిలేశ్వరస్వామి ఆలయం. ఇది శివకేశవ అబెదాన్ని చాటి చెప్పే గొప్ప క్షేత్రం. ఎందుకంటే ప్రముఖ  వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో అంతే పురాణ ప్రసిద్ధితో వెలసిల్లుతోన్న శైవక్షేత్రం కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం. ఆ కపిల తీర్థం విశేషాలిప్పుడు తెలుసుకుందాం.

యుగయుగాల చరిత్రను సొంతం చేసుకున్న క్షేత్రం కపిలతీర్థం

     కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. అలా వెలసిన శివయ్యను సేవించడానికి బ్రహ్మదేవుడు గోరూపంలోను, విష్ణుమూర్తి గోపాలుదిగాను వచ్చి కపిలేశ్వరుని అభిషేకించినట్టు చెప్తారు. శివలింగంతో పాటు భూమి మీదకు వచ్చిన భోగవతీ జలాలు కపిలతీర్తంగా ప్రసిద్ధి చెందాయని చెప్తారు.  కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ  ఈశ్వరుడుకొలువుతీరాడు  కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని కపిల లింగం అని ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ స్వామిని ఆరాధించాడు.  అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. పాతాళం నుంచి భూమిని చీల్చుకుంటూ వచ్చిన  కపిలేశ్వరుడు ఇక్కడ కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుచుకున్నా అత్యంత ప్రసిద్ధి చెందినది మాత్రం కపిలతీర్తమనే. పూర్వం వైష్ణవులు ఈ జలపాతం క్రింద ఉన్న కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపింఛి, రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు.



      విజయనగర చక్రవర్తిఅచ్యుత రాయలు ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని,

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్‌ రాజేంద్రచోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే... అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందని చెప్తారు. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు, మహా గణపతి, వల్లీ దేవసేన సామెత సుబ్రమణ్యస్వామి, శ్రీ రుక్మిణీ సత్యభామా సామెత వేణుగోపాలస్వామి, లక్ష్మీనారాయణ స్వామి, నమ్మాళ్వార్, నాగ దేవతలు, నవగ్రహాలు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, కూడా కొలువు తీరి ఉన్నారు. ఆహ్లాదం కలిగించే ఆలయం కపిలేశ్వర ఆలయం. అతి ప్రశాంతమైన వాతావరణం. పాతాళం నుంచి పైకి ఉబికి వచ్చిన పరమేశ్వరుడు. భువి నుంచి దివికి దిగి వస్తున్నా గంగమ్మ లా ఇరవై అడుగుల పైనుంచి కిందికి ఉరుకుతున్న కపిలతీర్థం జలపాతం. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో భక్తుల ఆర్తిని తీర్చే కపిలేశ్వర స్వామి ఆలయం. ఆలయ దర్శనం ఆధ్యాత్మికను పెంచితే, జలపాతంలో స్నానం శారీరక ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు.



     పూర్వం తిరుమల చేరుకోవటానికి రవాణా  సౌకర్యం అంతగా లేనప్పుడు, మెట్లమార్గం ద్వారా నడచి తిరుపతి వెళ్తూ, ఈ కపిలతీర్థంలో స్నానం   చేసి కపిలేశ్వరుడిని దర్శించి కాలినడకన తిరుమల వెళ్ళేవారట. రవాణా సౌకర్యాలు అపరిమితంగా పెరిగిన ఇప్పుడు కూడా తిరుమల నుంచి అలిపిరి వెళ్ళే అన్ని బస్ లు ఇక్కడున్న నంది సర్కిల్ వైపు నుంచే వెళ్తాయి. అక్కడ దిగి కపిలతీర్థం వెళ్ళవచ్చు.  

ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ఈ జలపాతం సౌందర్యం కనులకు విందే. అంతెత్తునుంచి హోరుమంటూ ఉబికే జలపాతం సుందర దృశ్యాలు చూపుతిప్పుకోనివ్వవు. ఈ  ప్రశాంత వాతావరణం అడుగు కూడా కడపనివ్వదు. ఇదిగో ఇక్కడ చూడండి హోరుమంటూ జాలువారుతున్న ఆ జలపాత అందాలనుంచి చూపి తిప్పుకోగాలమా... ఎంతసేపైనా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా.

తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంలోను, శివరాత్రి సందర్భంగాను శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం కూడా వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ వినాయక ఉత్సవాలు, కార్తీకమాస ఉత్సవాలు దేవి నవరాత్రలు, కామాక్షిదేవి చందన అలంకారం అత్యంత విశేషంగా వైభవంగా జరుగుతాయి.

  


         ఈ కపిలతీర్థం మహిమను గురించి సాక్షాత్తూ శ్రీనివాసుడే వకులమాతతో చెప్పినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి.  పద్మావతి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడడానికి వెళ్తున్న తల్లి వకులమాతతో,  అమ్మా నీవు ముందు కపిలతీర్థం  లో స్నానం ఆచరించి కపిలేశ్వరున్ని దర్శించి ఆ తర్వాతే  నారాయణవనం వెళ్ళి మా వివాహం విషయం మాట్లదు అలా చేస్తే శుభం జరుగుతుంది అని చెప్పాడట శ్రీనివాసుడు. దీన్ని బట్టే ఈ కపిలతీర్థం ఎంత పవిత్రమైనడి అన్న విషయం అర్థమవుతుంది.

కార్తీక మాసంలో ఈ కపిలేశ్వర ఆలయాన్ని అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. కపిలతీర్థం కపిలేశ్వరసామి ఆలయంలో కార్తీక పున్నమ రోజున విశేషపూజలు జరుగుతాయి. ఆరోజున ఈ కపిలతీర్థంలో స్నానం చేసి శివదర్శనం చేసినవారికి జీవితంలో శాంతి, లభిస్తుందని మరణానంతరం  ముక్తి లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.

 

కార్తీక పౌర్ణమి మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయన్నది పురాణ వచనం. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ ప్రక్షాళన అవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ తీర్థంలో స్నానం చేసి ఎ చిన్న దానం చేసినా అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి తండోపతండాలుగా తరలి భక్తులు వస్తుంటారు. కార్తికంలో నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసేవారితోను  పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపారాధనలు చేసేవారితోను కళకళలాడుతూ కైలాసశోభతో వెలిగిపోతుంది.

      తీర్థయాత్రలతో పాటు ఒక మంచి పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలంలో కుటుంబంతో సహా వెళితే.. పుణ్యం.. పురుషార్థం అన్నట్టుగా ఇటు ఆధ్యాత్మికంగాను, అటు పర్యాతకంగాను కూడా చక్కగా ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది.

      తిరుపతి బస్టాండు నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఆలయం ఉంది. తిరుపతి బస్ స్టాండ్ నుండి కపిలతీర్థానికి టిటిడి బస్సులు తిరుగుతుంటాయి. ఇందులో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా ప్రైవేటు వాహనాలు,ఆటోలూ ఉంటాయి. మదనపల్లి, చిత్తూరుల నుంచి తిరుపతి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి. ఇక్కడ దిగి కపిలతీర్థాన్ని చేరుకోవచ్చు.

23, మార్చి 2024, శనివారం

జమదగ్ని నుంచి అలెగ్జాండర్ వరకు / malana village mystery himachal pradesh /most mysterious village in india

 

అదో మర్మగ్రామం! అద్భుతమైన అందాల లోకం! భూలోక స్వర్గంలాంటి పర్యాటక ప్రదేశం! ఓ పాత సినిమాలో చెప్పినట్టు వారాల పేర్లే అక్కడ మనుషుల పేర్లు!

మహర్షి జమదగ్ని నుంచి గ్రీకువీరుడు అలెగ్జాండర్ వరకు సంబంధమున్న గ్రామం.

అది భారతదేశంలో ఓ భాగమే. కాని ఆ గ్రామ వాసులు భారతీయ నియమ నిబంధనల కంటే తమ ప్రత్యేకమైన నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాల ప్రకారమే జీవిస్తారు.

ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవీ వాళ్లకు పట్టవు అలాగని వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు. కాని తమకే తమకు మాత్రమె ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం తు.చ. తప్పకుండా పాటిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక స్కూల్ తప్ప ప్రభుత్వానికి సంబంధించి ఇంకేవీ ఉండవక్కడ. అప్పుడెప్పుడో కోర్ట్ కూడా ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. కాని అందులే కేసులే ఉండవు. 1987 లో అక్కడే కర్దార్ అంటే వారి పెద్ద ఓ కేసును కోర్టుకు తీసుకు వెళ్ళాడు, కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది. కాకపొతే ఆ తీర్పును గ్రామస్తులు పాటించలేదు సరికదా ఆ కోర్ట్ కు వెళ్ళిన పెద్దనే ఊళ్లోనుంచి వేలేసారట అక్కడి వారు.



అక్కడి ప్రజలు స్వేచ్చ, స్వతంత్రాలకు మారుపేరుగా ఉంటారు. అయితే అది విచ్చలవిడితనం మాత్రం కాదు. ఆ గ్రామస్తులు చాల నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలీ అంటే ఈ ప్రపంచానికి దూరంగా భవబంధాలకు అతీతంగా ఎవ్వరితోను సంబధంలేని ఓ రహస్య దీవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడిలా ఎత్తైన కొండలమధ్య, అందాల లోయలో ఉంటుంది మర్మగ్రామం “మలానా”.

ఇంతకీ ఈ మలానా గ్రామ మర్మమేంటి. ఇదెక్కడుంది...? ఆ కథా కమామిషేంటి?

దేవభూమిలో మర్మగ్రామం మలానా

దేవభూమి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో  అందానికే మరోపేరయిన పార్వతీ లోయను ఆనుకొని ఉంది మలానా గ్రామం. సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో ఉన్న పార్వతి లోయలో  పచ్చని, మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం మలానా.



మలానా అంతా ప్రత్యేకమే... వీరు మాట్లాడే భాష దగ్గర్నుంచి వేషం వరకు, జీవన విధానం  దగ్గర్నుంచి పెట్టుకునే పేర్ల వరకు అంతా డిఫరెంట్. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని భాష వీరు మాత్రమే మాట్లాడే వీరి భాష కనషీ భాష. తమ భాషను చాలా పవిత్రంగా చాలా పవిత్రమైందిగా భావిస్తారు మలానా గ్రామ ప్రజలు. అందుకే ఈ భాషను ఎవ్వరికీ బోధించరు వీరు. అందుకే కాస్త సంస్కృతం, కాస్త ఇతర భారతీయ భాషలు, ఇంకాస్త టిబెటన్, మరికాస్త కిన్నెరీ, గ్రీకు భాషల కలగలుపుగా ఉండే ఈ భాష మీద చాలా అధ్యయనాలు కూడా జరుగుతున్నాయట. వీరుండేది మన దేశంలోనే కాని మన ప్రభుత్వ విధి విధానాలేవీ వీళ్ళకు పట్టవు. వీళ్ళకంటూ స్వంతంగా ప్రత్యేకమయిన నియమ నిబంధనలు, చివరకు న్యాయ వ్యవష్టను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఊరందరిదీ ఒక దారయితే ఉలిపికట్టెది ఓ దారి అంటుంటారు చూడండి అలా ఉంటుందన్నమాట ఈ గ్రామం. అలా అని ఇదేదో ఓ సాధారణ వింత గ్రామం అనుకోకండి. దీని వెనక పెద్ద చరిత్రే ఉంది.



జమదగ్ని రుషి నుంచి అలెగ్జాండర్ వరకు

జమదగ్ని రుషి దగ్గర్నుంచి విశ్వవిజేత కాబోయి కొద్దిలో ఆగిపోయినా అలేగ్జాండర్ వరకు ఈ గ్రామనతో సంబంధం ఉన్నవారే. ముందుగా జమదగ్ని రుషి ఈ గ్రామంతో సంబంధమేంటి అన్నది తెలుసుకొని తరువాత అలెగ్జాండర్ విషయానికి వద్దాం.

     ఓసారి జమదగ్ని మహర్షి పరమేశ్వరుడి గురించి కఠినమయిన తపస్సు చేసాడు. ఆ తపస్సు కు మెచ్చిన భోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అనడిగాడు. ప్రకృతి ఒడిలో కూర్చున్నంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని ఇవ్వు తపస్సు చేసుకుంటాను అనడిగాడు జమదగ్ని. అప్పుడు హిమాలయల్లో ఈ మలానా గ్రామాన్ని సృష్టించి ఇచ్చాడట శివుడు.

      సరే ఆ విషయాన్ని అలా ఉంచితే ఎక్కడో గ్రీకు దేశపు అలెగ్జాండర్ కి ఈ గ్రామంతో సంబంధమేంటి?

     మలానా వాసులు అలెగ్జాండర్ వారసులా!?

               విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నే జయించుకుంటూ భారతదేశంలోకి అడుగుపెట్టిన సందర్భంలో చాలా ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకున్న తరువాత ఒక సమయంలో ఒక సమయంలో అలెగ్జాండర్ వెనుతిరగక తప్పని పరిస్తితి ఏర్పడింది అలెగ్జాండర్ కి. ఆ పరిస్తితిలో కొంతమంది సైనికులు ఈ ప్రాంతంలోనే ఉండిపోయారని అదే మలానా గ్రామమని చెప్తారు. వారి సంతతి వారే ఈ మలానా గ్రామంలో తరతరాలుగా జీవిస్తున్నట్టు చెప్తారు. అయితే అలెగ్జాండర్ సైనికుల వారసులు మలానాలో కాదు, పాకిస్తాన్‌లోని కలాష్ లోయ సమీపంలో  ఉన్నారు అని మరో వాదన కూడా వినబడుతుంది.

       ఇక ఈ మలానా గ్రామానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పార్వతీ లోయకు ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కాని ఆ సమీపంలోనే ఉన్న ఈ గ్రామంలోకి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. బయటివారిని ఎవ్వరినీ వీరు తమ గ్రామంలోనికి రానివ్వరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారు శిక్షలు, ఫైన్ లు కూడా అనుభవించాల్సి ఉంటుంది.

      మలానా లోయలో మహిమాన్విత మైన ఔషధాలున్నాయని చెప్తారు. ఓసారి అనారోగ్యానికి గురైన అక్బర్ చక్రవర్తికి ఎవరో మలానాలో ఉన్న ఔషధ వనాల గురించి చెప్పారట. దాంతో ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఔషధాలు వాడి స్వస్థత పొందాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. అయితే ఇలాంది కథనాలు విని ఎవ్వరైనా అక్కడికి వెళ్లి ఆ మొక్కల మీద చెయ్యి వేస్తే మాత్రం అస్సలూరుకోరట మలానా గ్రామ ప్రజలు.  



         గ్రామంలో సొంత న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు వీరు. కౌన్సిల్‌లో ఉండే పదకొండుమంది సభ్యులతో ఒక కౌన్సిల్  ఏర్పాటు చేసుకొని ఆ కౌన్సిల్ ద్వారా పాలనా వ్యవహారాలు నిరహించుకుంటారు. ఆ కౌన్సిల్  సభ్యులను తమ గ్రామ దేవత ‘జంబ్లూ’కి  ప్రతినిధులుగా భావి స్తారంతా. అలాగే గ్రామంలో న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దిగువ న్యాయస్థానం, ఎగువ న్యాయస్థానం ఉంటాయి. దిగువ కోర్టులో న్యాయం జరగలేదంటే ఎగువ కోర్టుకు వెళ్లొచ్చు. భారతదేశంలోనే ఉన్నా తమకంటూ ప్రత్యేకమైన ప్రక్రియతో ఉంటారు మలానా వాసులు. తమ గ్రామానికి చెందని వారిని వివాహం చేసుకోరు. తమ గ్రామానికి చెందని వ్యక్తులు చేసే వంటకాలను వీరు స్వీకరించరు.  అబ్బో ఇంకా చాల చాలా ఉంటాయి. ఇక అక్కడున్న వారి పేర్లయితే మరీ ప్రత్యేకం. పుట్టిన రోజును బట్టి పేర్లు పెడతారు. ఆదివారం పుట్టినవారికి అహ్త అని, సోమవారం పుట్టిన వారికి సౌనరు అని, మంగళవారం పుట్టిన వారికి మంగల్ అని... ఇలాంటి పేర్లే పెడతారు. దాంతో ఒకే పేరు గలవాళ్లు చాలామంది కనిపిస్తూ ఉంటారు. జీవన విధానం దగ్గర్నుంచి న్యాయవ్యవస్థ వరకు ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండడంతో మలానాని కొందరు ‘ద రిపబ్లిక్ ఆఫ్ మలానా’ అని కూడా పిలుస్తుంటారు. ఇది మర్మగ్రామం మలానా కథ.

శిరస్సులేని అమ్మవారి విగ్రహం.. / Erukumamba temple history vizag /vizag temples

 

ఆ ఆలయంలో అమ్మవారికి ఘనమైన కానుకలు సమర్పించుకోవలసిన అవసరం గాని, కఠినమైన మొక్కులు తీర్చుకోవలసిన పని గాని లేదు. సంపూర్ణ భక్తితో, సమర్పణ భావంతో కేవలం బిందెడు పసుపు నీళ్ళు అభిషేకిస్తే చాలు కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తుంది ఆ అమ్మవారు. సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినపుడు గర్భాలయంలో కొలువుతీరిన దేవీ దేవతలను పాదాలనుంచి శిరస్సు వరకు దర్శించుకుంటాం. మహిమాన్వితమైన కళకళలాడే అమ్మవారి ముఖాన్ని తనివితీరా దర్శించుకుంటాం. కాని ఈ ఆలయంలో మాత్రం అమ్మవారికి శిరస్సే ఉండదు. శిరస్సు లేకుండా అమ్మవారు ఎలా ఉంటుంది అంటే శిరస్సు ఉంటుంది. కాకపొతే ఉండవలసిన స్థానంలో ఉండదు. శిరస్సు ఉండవలసిన స్థానంలో ఓంకారం ఉంటుంది. శిరస్సు అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. ఎందుకిలా ఇంత వింతగా... విచిత్రంగా... మరా విచిత్రం వెనకున్న చరిత్రేంటో ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకొని, అమ్మవారిని దర్శించుకుందాం పదండి....



      ఆ జగజ్జనని ఈ ధరణి మీద వివిధ సందర్భాలలో వివిధ రూపాలలో కొలువుతీరి ఉంటుంది. అలాంటి ఆలయమే విశాఖపట్నం దుండపర్తి లో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం. విశాఖ వాసులకు, ఎరుకుమాంబ అమ్మవారు ఎంతో నమ్మకమైన ఆరాధ్య దేవత. చూడ్డానికి చిన్న ఆలయమే ఆ ఆలయం వెనకున్న చరిత్ర మాత్రం పెద్దది. అమ్మవారి విగ్రహం వెనక శ్రీచక్రం ఉందని అందుకే ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదని చెప్తారు. ఎరుకుమాంబ అమ్మవారి శిరస్సు ఉండవలసిన స్థానంలో కాకుండా కాళ్ళ దగ్గర ఉంటుందని మొదటే చెప్పను కదా. దీని వెనుక ఒక కథ ఉంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఏడో శతాబ్దం నుంచి ఎరుకమాంబ అమ్మవారు ఇక్కడ కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఎరుకుమాంబ అమ్మవారిని గౌరీ స్వారూపంగా భావించి ఆరాధిస్తారు. నిజానికి అమ్మవారు మొదట్నుంచి ఇక్కడ ఉండేవారు కాదు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన గల వైర్లెస్ కాలనీలో అమ్మవారీ ఆలయం ఉండేది. ఆ ఆలయంలో అమ్మవారూ నిత్యం పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మవారు స్థానికుల కలలో కనిపించి తనని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడైతే బండి ఆగిపోతుందో అక్కడ ఆలయ నిర్మాణం చేపించాలని చెప్పిందని ఓ కథనం. ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్టుగానే ఆ తల్లి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద నుంచి తీసుకెళ్తుండగా సరిగ్గా ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశానికి రాగానే దగ్గర బండి ఆగిపోవడమే కాకుండా అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరయి పడిపోయిందట. జరిగిన ఈ దారుణానికి భయపడి కంగారు పడిపోయిన ఆ గ్రామస్తులు తిరిగి ఆ శిరస్సును విగ్రహానికి అతికించాలనిఎంతగానో ప్రయత్నించారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శిరస్సు మాత్రం విగ్రహానికి అంటుకోలేడు.

దాంతో  ఆ గ్రామస్తులు ఇదేదో అపశకునమని, తమకు ఏదో కీడు జరుగబోతుందని చాలా భయపడ్డారు. వెంటనే తమ భయాన్ని అమ్మవారి ఎదుట మొరపెట్టుకోగా, విరిగిన ఆ శిరస్సు తన కాళ్ల దగ్గర పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని చెప్పిందట. అప్పటినుంచి భక్తులు అందరూ బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటూ అమ్మవారి దీవెనలను పొందుతున్నారు.




       ప్రతి బుధవారం నగరంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బిందెలతో పసుపు నీళ్ళతో అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. బిందెడు పసుపు నీళ్ళను మొక్కుకుంటే చాలు కోరిన కోరకలు నెరవేరుతాయని బాగా నమ్ముతారు స్థానికులు. ఈ విషయం అలా అలా బయటి ప్రాంతాలకు కూడా పాకి, సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం ఈ  స్నానోత్సవానికి వచ్చి అమ్మవారికి పసుపునీళ్ళ అభిషేకం చేస్తారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:00 P.M నుండి 5:30 P.M. వరకు ఈ బిందెనీళ్ళ సమర్పణ  అత్యంత ఘనంగా జరుగుతుంది. గురువారం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 

 

22, మార్చి 2024, శుక్రవారం

సర్పాలకు రెండు నాలుకలు ఎందుకుంటాయి?/Why do snakes have two tongues?

 సర్పాలకు నాలుక చీలుకలుగా ఎలా మారింది?


      సాగరమథనం అయిపొయింది. విష్ణుమాయతో దేవతలు అమృతాన్ని పొందగా, దానవులకు కష్టం మాత్రమె మిగిలింది. అయితే దేవదానవులు కలిసి తనను కవ్వపు తాడుగా చేసుకొని అమృతం సాధించిన తరువాత, దానిని విష్ణువు తెలివిగా దేవతలకు మాత్రమె దక్కేలా చెయ్యడం ఇదంతా చూసిన వాసుకి తెల్లపోయాడు. క్షీరసాగర మథన సమయంలో,కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు కూడా అమృతంలో వాటా ఇస్తానని కూడా ఇవ్వకపోయేసరికి, ఏమీ చెయ్యలేక అమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి,
ఆ కలశాన్ని పెట్టిన దర్భలమీద కాస్తయినా అమృతం పడిందేమో దానిని స్వీకరిద్దామని, ఆ దర్భలను నాలుకతో నాకేడట. అయితే దురదృష్ణం! వాసుకి సర్పానికి అమృతం దక్కలేదు సరికదా దర్భల పదునుకి నాలుక నిలువునా చీరుకు పోయి, రెండు నాలుకలుగా మారాయి. అదిగో అప్పటినుంచీ, వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువునా చీరుకుని ఉండి, రెండు నాలుక లున్నట్లుగా అనిపిస్తుందని పురాణ కథనాలు చెప్తున్నాయి.

 


     అయితే ఇలా సర్పాలకు నాలుక రెండుగా చీలికలుగా ఉండడానికి మరో కథనం కూడా చెప్తారు. ఆ కథనం గరుత్మంతునికి సంబంధించినది.గరుత్మంతుడు తన తల్లిని దాస్య విముక్తురాలిని చేసేందుకు చేసిన ప్రయత్నంలో సర్పాల మాత కద్రువ కోరిక ప్రకారం అమృతాన్ని తీసుకువచ్చి వారికివ్వడానికి అంగీకరించాడు. అలాగే స్వర్గానికి వెళ్లి అమృతాన్ని తెచ్చి, సర్పాలను శుచిర్భూతులై రమ్మని చెప్పగా సర్పాలు అలాగే వెళ్ళగా, వారు వచ్చేవరకు తాను తెచ్చిన  అమృతభాండాన్ని పవిత్రమైన దర్భలమీద పెట్టాడట గరుత్మంతుడు. అయితే సర్పాలకు అమృతం దక్కకూడదన్న ఆలోచనతో వారు వచ్చేలోగానే ఆ అమృతభాండాన్ని ఇంద్రుడు తీసుకుపోయాడు. దాంతో చేసేదేం లేక ఆ దర్భలమీద పడిన అమృత బిందువులనైనా స్వీకరిద్దామని సర్పాలు ఆ దర్భలను నాకినపుడు ఆ దర్భల గరుకుదనానికి సర్పాల నాలుకలు చీలికలుగా మారిపోయాయని ఓ కథనం. 

క్షీరసాగర మథనంలో ఏం ఉద్భవించాయో తెలుసా?/do you know what was born in ksheerasaagara mathanam

 

క్షీరసాగరం నుంచి ఏమేం ఆవిర్భవించాయి? ఎవరు స్వీకరించారు?

హాలాహలం – గరళం దీనిని పరమేశ్వరుడు స్వీకరించాడు.
సురభి లేదా కామధేనువు – తెల్లని ఆవు –కోరిన కోరికలు తీర్చగల అపరిమితమైన శక్తి గల గోమాత. సకల గో సంతతికి మాత. కామదేనువును దేవమునులు తీసుకున్నారు
     ఉచ్ఛైశ్రవము – ఎత్తైన తెల్లని, ఐదు తలల గుఱ్ఱము. ఒక దివ్యాశ్వం. దీనిని బాలి చక్రవర్తి తీసుకున్నాడు.

ఐరావతము – నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు – దీనిని ఇంద్రుడు తీసుకున్నాడు.
కల్పవృక్షం – కోరికలు తీర్చే దివ్యమైన దేవతా వృక్షం. ఇది స్వర్గలోకంలో ప్రతిష్టించబడింది.
            దేవతా సుందరీమణులు, రంభ,మేనక,ఘ్రుతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోష మొదలైన అప్సరసలు ఉద్భవించారు.
          సుధాకరుడు అంటే  చంద్రుడు కూడా క్షీరసాగర మధనంలో ఉద్బవించగా, శివుడు తన శిరస్సున శిగలో ధరించాడు.

సకల సంపదలకు అధి దేవతలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది. లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు స్వీకరించాడు.

ఇక క్షీరసాగర మాధనంలోనే ఉద్భవించింది వారుణి – మద్యానికి అధిదేవత. వారుణిని రాక్షసులు స్వీకరించారు.

ఇంకా దివ్య ఛత్రం,దివ్య ధనుస్సు,దివ్యశంఖం ఇలా చాలా దివ్య వస్తువులు ఉద్భవించాయి.

చివరిగా అమృత భాండంతో ధన్వంతరి ఆవిర్భవించారు.

పురాణాలలో చెప్పే సప్త సముద్రాలు అంటే ఏవి?/Seven seas mentioned in puranas/Seven seas in hindu epics

 

సప్త సముద్రాలు


         పురాణ కథనాల ప్రకారం సప్త సాగరాలు ఉన్నాయని చెప్తారు. ఆ సప్త సముద్రాలు

లవణ సముద్రము అంటే ఉప్పు సముద్రం ఇది ఒక లక్ష యోజనాల మేరకు ఉంటుందట.

ఇక్షు అంటే  (చెరకు) సముద్రము ఇది రెండు లక్షల యోజనాలు

సురా అంటే (మద్యం సముద్రము నాలుగు లక్షల యోజనాలు

సర్పి అంటే (ఘృతం లేదా  నెయ్యి) సముద్రము ఎనిమిది లక్షల యోజనాలు

క్షీర అంటే  (పాల) సముద్రము పదహారు లక్షల యోజనాలు

దధి అంటే  (పెరుగు) సముద్రము 32 లక్షల యోజనాలు

ఉదక (మంచినీటి) సముద్రము 64 లక్షల యోజనాలు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.  ఇలా ఏడు సముద్రాల గురించి పురాణాలు చెప్తున్నాయి.

         ఆ సప్త సముద్రాలలో ప్రధానమయినది, ముఖ్యంగా శ్రీమహావిష్ణువు నివాసముండే పాల సముద్రం, క్షీరసాగరం చిలికి అముతం సాధించాలని దేవతలు, దానవులు అనుకుంటే, అమృతం తో పాటు పోగొట్టుకున్న తమ ఐశ్వర్యాన్ని కూడా పొందాలని దేవతలు భావించారు.

21, మార్చి 2024, గురువారం

క్షీరసాగర మథనం విష్ణుమూర్తి రెండు అవతారాలకు వేదిక/భాగవత కథలు/kurmavataram

      శ్రీమహావిష్ణువు రెండు అవతారాలకు వేదిక క్షీరసాగరమధనం. ఎంతోమంది దేవీ దేవతలు ఆవిర్భవించిన సందర్భం. అమృతంతో పాటు ఎన్నో అపురూప ఆవిష్కరణలు క్షీరసాగర మథనం లో జరిగాయి. పరమేశ్వరుడు గరళకంటుడు అంటారు... అసలెందుకు గరళకంటుడు అయ్యాడు. శివుడి గరలకంతుడు అన్న పేరుకి క్షీరసాగర మధనానికి సంబంధమేంటి? 

     ఎంతో ఉత్సాహంగా, సంరంభంగా క్షీరసాగర మధనం ప్రారంభమయింది. మందరగిరిని కవ్వంగా, సర్పరాజు వాసుకిని కవ్వపుతాడుగా చేసుకొని దేవ,దానవులు చిలకడం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చిందట. ఆరొదకే  ఎన్నో జీవరాశులు మరణించాయట.  అయితే సాగరంలో . అడుగున కుదురు లేనందున బరువైన మందరగిరి మునిగిపోవడం మొదలయింది.  పని ప్రారంభంలోనే ఇలాంటి ఆటంకం ఏర్పడడంతో రాక్షసులు దేవతలూ అందరూ హతాశులయ్యారు. మందర పర్వతాన్ని మళ్ళీ పైకి ఎత్తడానికి శతవిధాలా ప్రయత్నించి ఓడిపోయారు. ఏం చెయ్యాలో పాలుపోక నిలబడిపోయారు.



     కూర్మావతార ఆవిర్భావం

        క్షీరసాగర మధనంలో ఏర్పడిన ఈ ఆటంకమే శ్రీమహావిష్ణువు రెండవ అవతారం కూర్మావతారానికి నాంది పలికింది. ఎప్పుడు ఏ ఆటంకం వచ్చినా దేవతలకు అండగా నిలబడే శ్రీమన్నారాయణుడు రంగంలోకి దిగాడు. సముద్రపు నీళ్ళల్లో మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూసిన విష్ణుయూర్తి సముద్రంలో దిగాడు, మహా కూర్మంగా మారిపోయాడు. అదే కూర్మావతారం. దశావతారాలలో రెండవ అవతారం.  ఆ కూర్మం అంటే  తాబేలు లక్ష ఆమడల వెడల్పైన చదునైన వీపుడిప్పతో, బ్రహ్మాండాన్ని సైతం మ్రింగగల పెద్ద నోటితో, లోకంలోని ప్రాణులన్నింటినీ ఇముడ్చుకోగల కడుపుతో, కమలాల లాంటి కళ్ళతో, లోపలకూ బయటకు కదలాడే పెద్ద మూతితో, బలమైన పాదాలుతో ఉన్న ఆ మహాకూర్మం సముద్రంలో ప్రవేశించి మందార పర్వతం కిందికి చేరి ఆ పైకెత్తింది. దాంతో అందరూ జేజేల పలికారు.  విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించిన ఈ  కథను వినినా,  చదివినా కూడా  సంసార సముద్రంలో మునిగిపోయే జనులు గొప్ప పుణ్యాన్ని, సుఖాన్నీ పొందుతారని పురాణ కథనాలు చెప్తున్నాయి.


                  కూర్మం మళ్ళీ మందరగిరిని సాగరం పైకి ఎత్తి పెట్టడంతో  అపరిమిత ఆనందంతో పోటీపడి సముద్రాన్ని మధించసాగారు దేవదానవులు. అలా మధించగా అల్లకల్లోలమైన సముద్రం నుంచి జలచరాలన్నీ ఎగిరి గట్టుపై పడ్డాయి. సముద్రం నుంచి అగ్నిజ్వాలలు ఎగిసాయి. ఆ వెనువెంటనే తరువాత హాలాహలం అనే విషం వచ్చింది. బ్రహ్మాండం బద్దలయినట్టుగా ఆ హాలాహలం అంతటా విస్తరించింది. అందరూ హాహాకారాలు చేయసాగారు. ఆ విషజ్వాలల  వేడికి ఎంతో మంది దేవతలు రాక్షసులు భస్మమయ్యారు. చెల్లాచెదురయి పరుగులు పెట్టసాగారు.

     గరళకంటుడైన శివుడు

అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొర పెట్టుకున్నారు. పరమేశ్వరా... చంద్రశేఖరా... రక్షమాం రక్షమాం. నీవే మాకు దిక్కు. శంకరా... ఆపదలను తొలగించే ఆపద్భాందవా... నీవు తప్ప మాకు దిక్కులేదు. క్షీర సాగర మధనంలో వచ్చిన ఆ హాలాహలాన్ని  గ్రహించి దయతో మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకున్నారు.

భోళాశంకరుడు వారి ప్రార్థన సావకాశంగా విన్నాడు. పరమేశ్వరుడు ఆ మహా గరళాన్ని తన చేయి చాచి పట్టుకొని ముద్దగా చేసి నేరేడు పండును మింగినట్టు గొంతులో వేసుకున్నాడు. సమస్త లోకాలకు నివాస స్థానం పరమేశ్వరుని కుక్షి అంటే కడుపు. పరమేశ్వరుడు మింగిన ఆ గరళం గొంతు దాటి, కడుపులోకి చేరితే సమస్త లోకాలు ఆపదలో పడిపోతాయి. అందుకే శివుడు ఆ విషాగ్నిని మ్రింగకుండా గొంతులో పట్టి ఉంచాడు. అలా మ్రింగకుండా గొంతు దాటకుండా ఆ హాలాహలం గ్రొంతులోనే ఉంచడం వలన ఆ విషాగ్ని వేడికి ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడింది. అలా ఈశ్వరుడు  నీలకంటుడు, గరళకంటుడు అయ్యాడు. శివుని ఈ “హాలాహలభక్షణం” కథను విన్నా,  చదివినా వారు ఎటువంటి  భయానికి గురికారు. అలాగే  పాముల వల్లనూ, త్రేళ్ళ వల్లనూ, అగ్ని వల్లనూ కష్టాన్ని పొందరు అని ఫలశ్రుతి చెబుతోంది.



అనంతరం దేవతలూ, రాక్షసులూ సముద్ర మధనం మరల కొనసాగించారు.

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు , అన్నప్రసాడం , తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి , ...