సరస్వతీనది
ఆవిర్భావం ఎలా జరిగింది అన్న పురాణ కథనం విషయానికి వస్తే, దేవీ భాగవతంలో ఒక కథనం ప్రకారం ఆ పరాశక్తి,
సృష్టికి ముందే ఐదు రూపాయలు ధరించిందట. అవి దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి,
సావిత్రి. వారిలో జ్ఞానప్రదాయినిగా సరస్వతిదేవి భాసిల్లింది. ఈ తల్లిని మొట్టమొదట
శ్రీకృష్ణుడు మాఘ పంచమినాడు పూజించాడని, అప్పటి నుంచే
మాఘపంచమి నాడు అమ్మను ఆరాధించడం ప్రారంభించినట్లు చెప్తారు.
మరో పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు
అతడి నోటి నుండి ఒక అందమైన కన్య వెలికి వచ్చిందట. ఆ కన్యకు వాక్ అని పేరు పెట్టిన
బ్రహ్మదేవుడు సకల జనులకు వాక్ శుద్ధి ప్రసాదించే దేవతగా పండితుల నాలుకల మీద,
భూమిమీద నది రూపంలో రెండవ విధంగా,
ఇక మూడో విధంగా తనలోనే ఉండమని ఆమెను ఆశీర్వదించాడట. అలా సరస్వతి మాత భూమి మీద నది
రూపంలో ప్రవహించింది అని చెప్తారు.
ఇక పురాణ కథనాల్లో
సరస్వతీనదికి సంబంధించి, వివిధ కథనాలు మనకు కనబడతాయి. ఋగ్వేదంలో సరస్వతిగా
వర్ణించబడిన ఈ నది ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి శాప ఫలితంగా భూతప్రేతాలకు ఆలవాలంగా
మారిందట. వశిష్ట మహర్షిని బద్ధ శత్రువుగా భావించే విశ్వామిత్రుడు, వశిష్టుని
ఎలాగైనా పరాభవించాలన్న సంకల్పంతో సరస్వతీ నది తీరంలో సరస్వతి మాతను లింగాకారంలో
ప్రతిష్టించి ఆరాధించాడట. అతని భక్తికి మెచ్చిన సరస్వతీ మాత ప్రత్యక్షమై ఏం వరం
కావాలో కోరుకోమంది. తనకేమీ అక్కరలేదని, నదికి ఆవలి ఒడ్డున ఉన్న వశిష్టుని నదీ
జలాల్లో ముంచి తీసుకురమ్మని కోరాడు విశ్వామిత్రుడు. అయితే ఈ కోరిక చాలా అన్యాయము. పైగా సాత్వికుడు
తన భక్తుడు అయినటువంటి ఆ వశిష్ఠుడిని అలా చేయడానికి నిరాకరించింది సరస్వతీమాత.
దాంతో క్రోధానికి లోనయిన విశ్వామిత్రుడు, ఆ
నది భూతప్రాతాలకు పిశాచాలకు ఆలవాలంగా మారుతుందని శపించాడు. నది యొక్క దుర్దశను
చూసిన ఋషులు తమ యొక్క తపశక్తినంతా ధారపోసి సరస్వతీ నదిని సంరక్షించి
పూర్వవైభవాన్ని తెచ్చినట్టుగా ఓ కథనం.
ఈ సరస్వతి నది పశ్చిమ తీరాన ఉన్న బదరికా వనలోనే వ్యాసుడు భాగవత
కావ్యాన్ని వ్రాశాడు అని కూడా చెబుతారు. ఇది ప్రస్తుతం బద్రీనాథ్ సమీపంలో ఉన్న మాన
గ్రామానికి కొద్ది దూరంలో మనం చూడొచ్చు. ఇక బలరాముడు ద్వారకనుండి మధురకు
వెళ్ళినప్పుడు సరస్వతి యమునల మార్గంలోనే పయనించాడట. ఇలా ఎన్నో సందర్భాలలో సరస్వతీ
నది ప్రస్తావన మనకు కనబడుతుంది. సరస్వతి నది ఈ భూమ్మీద ఏడు పేర్లతో ఉద్భవించినట్టు
పురాణాలు చెబుతున్నాయి. అవి సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఒషువతి, సురేణువు,
విమలోదక.
ఒకసారి పుష్కర తీరంలో
బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ప్రభావంతో ఏ పదార్థాలను తలుచుకుంటే అవన్నీ
ప్రత్యక్షమయ్యాయట. దాంతో యజ్ఞం సుసంపన్నమైనట్టుగా భావించారందరూ. కానీ అక్కడ పరమ
పవిత్రమైన సరస్వతి నది జలాలు లేవు కాబట్టి యాగం పరిపూర్ణం కానట్టే అన్నారు
మునులు. అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు అక్కడ ఆవిర్భవించిన సరస్వతి నది సుప్రభగా
పిలవబడింది. ఇక సరస్వతి నది మిగిలిన నామములు విషయానికొస్తే, నైమిశారణ్యంలో
సత్రయాగం చేస్తున్న మునుల కోరికపై కాంచనాక్షి గాను, గయలో గయ మహారాజు చేసిన యజ్ఞంలో
అతడి ఆహ్వానం మీద విశాల అన్న పేరుతోనూ, కోసల ప్రాంతంలో ఉద్దాలకుడు చేసిన యజ్ఞంలో
మనోరమగాను, కురుక్షేత్రంలో కురురాజు చేసిన యాగంలో సురేణువు గాను, హరిద్వార్ లో
దక్షుడు చేసిన యజ్ఞంలో సరస్వతి గాను, వశిష్టుని ఆహ్వానం మేరకు కురుక్షేత్రంలో ఓషువతి
అన్న పేరుతోను, హిమవత్ పర్వతం మీద బ్రహ్మ చేసిన యజ్ఞంలో విమలోదక అని ఈ సప్త
నామాలతో ఆవిర్భవించింది సరస్వతి నది. మరికొద్ది రోజుల్లో సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పూర్తి వివరాలు క్రింద వీడియోలో చూడండి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి