23, మార్చి 2024, శనివారం

శిరస్సులేని అమ్మవారి విగ్రహం.. / Erukumamba temple history vizag /vizag temples

 

ఆ ఆలయంలో అమ్మవారికి ఘనమైన కానుకలు సమర్పించుకోవలసిన అవసరం గాని, కఠినమైన మొక్కులు తీర్చుకోవలసిన పని గాని లేదు. సంపూర్ణ భక్తితో, సమర్పణ భావంతో కేవలం బిందెడు పసుపు నీళ్ళు అభిషేకిస్తే చాలు కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తుంది ఆ అమ్మవారు. సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినపుడు గర్భాలయంలో కొలువుతీరిన దేవీ దేవతలను పాదాలనుంచి శిరస్సు వరకు దర్శించుకుంటాం. మహిమాన్వితమైన కళకళలాడే అమ్మవారి ముఖాన్ని తనివితీరా దర్శించుకుంటాం. కాని ఈ ఆలయంలో మాత్రం అమ్మవారికి శిరస్సే ఉండదు. శిరస్సు లేకుండా అమ్మవారు ఎలా ఉంటుంది అంటే శిరస్సు ఉంటుంది. కాకపొతే ఉండవలసిన స్థానంలో ఉండదు. శిరస్సు ఉండవలసిన స్థానంలో ఓంకారం ఉంటుంది. శిరస్సు అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. ఎందుకిలా ఇంత వింతగా... విచిత్రంగా... మరా విచిత్రం వెనకున్న చరిత్రేంటో ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకొని, అమ్మవారిని దర్శించుకుందాం పదండి....



      ఆ జగజ్జనని ఈ ధరణి మీద వివిధ సందర్భాలలో వివిధ రూపాలలో కొలువుతీరి ఉంటుంది. అలాంటి ఆలయమే విశాఖపట్నం దుండపర్తి లో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం. విశాఖ వాసులకు, ఎరుకుమాంబ అమ్మవారు ఎంతో నమ్మకమైన ఆరాధ్య దేవత. చూడ్డానికి చిన్న ఆలయమే ఆ ఆలయం వెనకున్న చరిత్ర మాత్రం పెద్దది. అమ్మవారి విగ్రహం వెనక శ్రీచక్రం ఉందని అందుకే ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదని చెప్తారు. ఎరుకుమాంబ అమ్మవారి శిరస్సు ఉండవలసిన స్థానంలో కాకుండా కాళ్ళ దగ్గర ఉంటుందని మొదటే చెప్పను కదా. దీని వెనుక ఒక కథ ఉంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఏడో శతాబ్దం నుంచి ఎరుకమాంబ అమ్మవారు ఇక్కడ కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఎరుకుమాంబ అమ్మవారిని గౌరీ స్వారూపంగా భావించి ఆరాధిస్తారు. నిజానికి అమ్మవారు మొదట్నుంచి ఇక్కడ ఉండేవారు కాదు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన గల వైర్లెస్ కాలనీలో అమ్మవారీ ఆలయం ఉండేది. ఆ ఆలయంలో అమ్మవారూ నిత్యం పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మవారు స్థానికుల కలలో కనిపించి తనని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడైతే బండి ఆగిపోతుందో అక్కడ ఆలయ నిర్మాణం చేపించాలని చెప్పిందని ఓ కథనం. ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్టుగానే ఆ తల్లి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద నుంచి తీసుకెళ్తుండగా సరిగ్గా ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశానికి రాగానే దగ్గర బండి ఆగిపోవడమే కాకుండా అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరయి పడిపోయిందట. జరిగిన ఈ దారుణానికి భయపడి కంగారు పడిపోయిన ఆ గ్రామస్తులు తిరిగి ఆ శిరస్సును విగ్రహానికి అతికించాలనిఎంతగానో ప్రయత్నించారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శిరస్సు మాత్రం విగ్రహానికి అంటుకోలేడు.

దాంతో  ఆ గ్రామస్తులు ఇదేదో అపశకునమని, తమకు ఏదో కీడు జరుగబోతుందని చాలా భయపడ్డారు. వెంటనే తమ భయాన్ని అమ్మవారి ఎదుట మొరపెట్టుకోగా, విరిగిన ఆ శిరస్సు తన కాళ్ల దగ్గర పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని చెప్పిందట. అప్పటినుంచి భక్తులు అందరూ బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటూ అమ్మవారి దీవెనలను పొందుతున్నారు.




       ప్రతి బుధవారం నగరంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బిందెలతో పసుపు నీళ్ళతో అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. బిందెడు పసుపు నీళ్ళను మొక్కుకుంటే చాలు కోరిన కోరకలు నెరవేరుతాయని బాగా నమ్ముతారు స్థానికులు. ఈ విషయం అలా అలా బయటి ప్రాంతాలకు కూడా పాకి, సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం ఈ  స్నానోత్సవానికి వచ్చి అమ్మవారికి పసుపునీళ్ళ అభిషేకం చేస్తారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:00 P.M నుండి 5:30 P.M. వరకు ఈ బిందెనీళ్ళ సమర్పణ  అత్యంత ఘనంగా జరుగుతుంది. గురువారం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు , అన్నప్రసాడం , తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి , ...