21, మార్చి 2024, గురువారం

ఉడుపి శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం / udupi sri krishna idol secrets / udupi sri krishna

 


     ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో మారుమోగే ఆలయం ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం. విశిష్ట చరిత్ర కలిగిన ఆలయం. శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రధానంగా నాలుగు ఆలయాల గురించి చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో ఉన్న మథుర నగరం, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, కేరళ రాష్ట్రంలోని గురువాయూరు, కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న కృష్ణ దేవాలయాలు. వీటిలో ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి, అక్కడ కొలువుతీరిన కృష్ణయ్య విగ్రహానికి పెద్ద చరిత్రే ఉంది. పెద్ద చరిత్రేంటి...! యుగాల చరిత్ర ఉంది. స్వయంగా రుక్మిణిదేవి విశ్వకర్మతో తయారుచేయించిన కృష్ణయ్య మూర్తి కొలువైన ఆలయం ఉడిపిలో ఉంది.

     ఉడిపి పట్టణానికీ ఉందో చరిత్ర

     ఉడిపి క్షేత్రంలో కొలువైన కృష్ణయ్య మూర్తికి ఎంత చరిత్ర ఉందో ఆ పట్టణ పేరుకి కూడా అంత చరిత్రా ఉంది. ఉడుపిలో కొలువైన శ్రీకృష్ణుని చరిత్ర తెలుసుకునే ముందు ఆ క్షేత్ర పేరుకున్న చరిత్రేంటో చూద్దాం. ఈ క్షేత్రానికి గల పురాణనామం రజతపీఠపురం. పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతున్నాడు. ఆ సందర్భంలో నాగలి తగిలి ఒక సర్పం మరణించింది. దాంతో సర్పదోషం కలుగుతుందని బాధపడుతున్న రామభోజుణ్ణి, పరశురాముడు ఓదార్చి జరిగిన తప్పిదానికి పరిహారం చెప్పాడు. అక్కడ  నాలుగు దిక్కులా నాలుగు నాగ ప్రతిమలను ప్రతిష్ట చేయమని చెప్పాడు. పరశురాముడు చెప్పినట్టుగానే నాలుగు దిక్కులా నాలుగు వెండి పీఠాలను స్థాపించి, వాటిపై నాగప్రతిష్టలను చేసాడు రామభోజుడు. ఆవిధంగా వెండిపీఠాలను కలిగిన ఆ స్థలం “రజతపీఠపురం”గా ప్రఖ్యాతి చెందింది. ఆ తరువాత పరశురాముడు “అనంతేశ్వరుడు” అన్న పేరుతో, ఓ లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడని ఓ కథనం ఉంది.

     మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. సంస్కృతంలో “ఉడు” అంటే నక్షత్రమని అర్థం. “ప” అంటే పతి అని అర్థం. ఈవిధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా “ఉడుప” అన్న పేరు ఈ క్షేత్రానికి ఉంది. అదే కాలక్రమంలో ఉడుపిగాను, ఉడిపిగాను మారింది.

     ఉడిపి కృష్ణ విగ్రహం వెనకున్న చరిత్ర

     ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉడుపి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా, ప్రముఖంగా చెప్పుకునేది మాత్రం “శ్రీ కృష్ణ మఠం”. ఉడుపిలో ఉన్న కృష్ణయ్య మూర్తి సాక్షాత్తూ రుక్మిణీదేవే విశ్వకర్మ చేత తయారుచేయించిందని చెబుతారు. ఈ శ్రీకృష్ణుని మూర్తి బాలకృష్ణునిది. రుక్మిణీదేవే స్వయంగా చేయించిన ఈ బాలకృష్ణుని మూర్తి వెనక ఒక కథ ఉంది. ఒకసారి కృష్ణుని తల్లి దేవకీదేవి కృష్ణునితో అందట. కృష్ణా! యశోద అద్రుష్ణవంతురాలు నీ బాల్యలీలలన్నీ చూసి మురిసిపోయింది. తరించిపోయింది. కాని  నా దురదృష్టం వలన నీ బాల్య లీలను చూసే అదృష్టం నాకు లేకపోయింది. నీ బాల్య లీలలు చూడాలని చాలా ఆశగా ఉంది ఆ భాగ్యాన్ని కలిగించవా... అనడిగిందట. సరే అన్న శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారి అన్న బలరాముడితో కలసి ఆడుకున్నాడట. అలా బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకిదేవితో పాటూ రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది. ఆ ఆనందంతోనే ఈ  చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణి దేవి విశ్వకర్మ ను పిలిచి వారి బాల్య రూపాలతో విగ్రహాలను తయారు చేయించింది.  కృష్ణావతారం ముగిసిన తరువాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయినప్పుడు ఈ మూర్తి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత కాలంలో ఎనిమిది వందల ఏళ్ళ క్రితం శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికిందని చరిత్ర చెబుతోంది.

     సముద్రగర్భంలో చేరిన శ్రీకృష్ణుని మూర్తి మళ్ళీ బయటపడి ఉడుపి క్షేత్రంలో ఎలా కొలువుతీరింది?

     ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడుపికి సమీపంలో గల మల్పే అన్న ప్రాంతంలో, సముద్రతీరంలో ధ్యానమగ్నులై ఉన్నారు. ఇంతలోనే స్వామివారికి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి. కళ్ళు తెరచి చూడగా, తుఫానులో చిక్కుకొని సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది. మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి త్రిప్పి, తుఫానుగాలిని నియంత్రించారు. దాంతో తుఫాను నుంచి తప్పించుకొని బ్రతికి బైటపడిన నౌకలోని వర్తకులు తమ నౌకను చూపించి, నౌకలో చాలా విలువైన రత్నాలు, మణులు ఉన్నాయని మీకేం కావాలో తీసుకోమ్మని చెప్పారు. కాని మధ్వాచార్యులవారు ఇవేవీ వద్దని నౌకలో ఉన్న రెండు పెద్ద గోపీచందనం ముద్దలను తీసుకున్నారు.


       ఆ రెండు చందనపు ముద్దల్లో ఒకటి మధ్వాచార్యుల చేతినుండి జారిపడి నీళ్ళలో చందనమంతా కరిగిపోయి అందులోనుంచి బలరాముని విగ్రహం బయటపడింది. మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఆ మూర్తి పడిన స్థలంలోనే ప్రతిష్టించారు. ఆ స్థలమే “ఒడభాండేశ్వరం”గా ప్రసిద్ధికెక్కింది. మిగిలిన చందనపు గడ్డను తీసుకుని “ద్వాదశ స్తోత్రం” అనే దివ్యస్తుతిని ఆశువుగా పఠిస్తూ ఉడుపికి తీసుకువచ్చారు మధ్వాచార్యుల వారు. ఉడుపిలో  మధ్వసరోవరంలోని నీటిలో ఆ చందనపు ముద్దను ముంచగానే, అందులోనుంచి కృష్ణయ్య మూర్తి దర్శనమిచ్చింది. వెంటనే శ్రీకృష్ణ మూర్తిని మధ్వాచార్యులవారు  స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం… మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదట. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని చెప్తారు. విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ, సామాన్య శకం 1236లో బాల శ్రీకృష్ణుని విగ్రహం  ఉడిపిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచీ మధ్వాచార్యులు అవలంభించిన పూజా విధానాన్నే అనుసరిస్తున్నారు. ఆ విగ్రహమే నేడు శ్రీకృష్ణమందిరంలో అర్చామూర్తిగా పూజలందుకొంటోంది. అలా ద్వాపరయుగంలో రుక్మిణీదేవి చేత తయారుచేయించబడి పూజించబడిన కృష్ణవిగ్రహం ఉడుపికి చేరింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు , అన్నప్రసాడం , తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి , ...