29, మార్చి 2024, శుక్రవారం

తిరుపతిలో ఈ ప్రదేశం చూడకపోతే చాలా మిస్సవుతారు / If you don't see it in tirupati you will miss it a lot

 

     తిరుపతిలో ఈ ఆలయాన్ని చూడకపోతే మీరు చాలా మిస్సవుతారనే చెప్పాలి. ఈ ఆలయంలో శివుని డమరుక శబ్దం, ఓంకారం వినిపిస్తుందట. అక్కడే ఇరవై అడుగుల ఎత్తునుండి హోరుమంటూ దూకే జలపాతం, గలగలమంటూ ఉరికే గంగమ్మ తల్లి తొలిసారి భగీరథుని కోరిక మీద శివుని ఝటాఝూటం నుంచి ఉరుకుతూ, దుముకుతున్న గంగమ్మను కళ్ళముందు నిలిపే దృశ్యం. పాతాళం నుంచి భూమిని చీల్చుకొని వచ్చిన శివలింగం. శ్రీమన్నారాయణుని అంశతో పుట్టిన కపిల మహర్షి తపస్సు చేసిన స్థలం... శివ, కేశవ అబేధాన్ని చాటే ఆలయం... ఇటు ఆధ్యాత్మిక విశేషాలు, అటు ప్రకృతి అందాలు కలగలిసిన అద్భుత ఆలయ విశేషాలు తెలుసుకుందాం..



      వైష్ణవ క్షేత్రాల ప్రసక్తి రాగానే ముందుగా జ్ఞాపకం వచ్చే ఆలయాలలో ముందువరుసలో ఉంటుంది తిరుపతి క్షేత్రం. అక్కడ ప్రతి ఆకూ, పువ్వూ, కొమ్మ, రెమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే అణువణువూ వేంకటేశ్వరుడే. ప్రపంచ ప్రసిద్దిచెందిన తిరుమల. కొండమీద వెంకన్న. కొండ కింద శివయ్య. తిరుపతి అనగానే వెంటనే మన కళ్ళముందు మెదిలేది శ్రీవెంకటేశ్వరస్వామి దివ్యదర్శనం ఒకటయితే రెండవది ఇరవై అడుగుల ఎత్తునుండి హోరుమంటూ దుముకుతూ చూపు తిప్పుకోనివ్వని కపిలతీర్థం జలపాతం. కపిలేశ్వరస్వామి ఆలయం. ఇది శివకేశవ అబెదాన్ని చాటి చెప్పే గొప్ప క్షేత్రం. ఎందుకంటే ప్రముఖ  వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో అంతే పురాణ ప్రసిద్ధితో వెలసిల్లుతోన్న శైవక్షేత్రం కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం. ఆ కపిల తీర్థం విశేషాలిప్పుడు తెలుసుకుందాం.

యుగయుగాల చరిత్రను సొంతం చేసుకున్న క్షేత్రం కపిలతీర్థం

     కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. అలా వెలసిన శివయ్యను సేవించడానికి బ్రహ్మదేవుడు గోరూపంలోను, విష్ణుమూర్తి గోపాలుదిగాను వచ్చి కపిలేశ్వరుని అభిషేకించినట్టు చెప్తారు. శివలింగంతో పాటు భూమి మీదకు వచ్చిన భోగవతీ జలాలు కపిలతీర్తంగా ప్రసిద్ధి చెందాయని చెప్తారు.  కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ  ఈశ్వరుడుకొలువుతీరాడు  కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని కపిల లింగం అని ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ స్వామిని ఆరాధించాడు.  అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. పాతాళం నుంచి భూమిని చీల్చుకుంటూ వచ్చిన  కపిలేశ్వరుడు ఇక్కడ కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుచుకున్నా అత్యంత ప్రసిద్ధి చెందినది మాత్రం కపిలతీర్తమనే. పూర్వం వైష్ణవులు ఈ జలపాతం క్రింద ఉన్న కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపింఛి, రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు.



      విజయనగర చక్రవర్తిఅచ్యుత రాయలు ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని,

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్‌ రాజేంద్రచోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే... అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందని చెప్తారు. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు, మహా గణపతి, వల్లీ దేవసేన సామెత సుబ్రమణ్యస్వామి, శ్రీ రుక్మిణీ సత్యభామా సామెత వేణుగోపాలస్వామి, లక్ష్మీనారాయణ స్వామి, నమ్మాళ్వార్, నాగ దేవతలు, నవగ్రహాలు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, కూడా కొలువు తీరి ఉన్నారు. ఆహ్లాదం కలిగించే ఆలయం కపిలేశ్వర ఆలయం. అతి ప్రశాంతమైన వాతావరణం. పాతాళం నుంచి పైకి ఉబికి వచ్చిన పరమేశ్వరుడు. భువి నుంచి దివికి దిగి వస్తున్నా గంగమ్మ లా ఇరవై అడుగుల పైనుంచి కిందికి ఉరుకుతున్న కపిలతీర్థం జలపాతం. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో భక్తుల ఆర్తిని తీర్చే కపిలేశ్వర స్వామి ఆలయం. ఆలయ దర్శనం ఆధ్యాత్మికను పెంచితే, జలపాతంలో స్నానం శారీరక ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు.



     పూర్వం తిరుమల చేరుకోవటానికి రవాణా  సౌకర్యం అంతగా లేనప్పుడు, మెట్లమార్గం ద్వారా నడచి తిరుపతి వెళ్తూ, ఈ కపిలతీర్థంలో స్నానం   చేసి కపిలేశ్వరుడిని దర్శించి కాలినడకన తిరుమల వెళ్ళేవారట. రవాణా సౌకర్యాలు అపరిమితంగా పెరిగిన ఇప్పుడు కూడా తిరుమల నుంచి అలిపిరి వెళ్ళే అన్ని బస్ లు ఇక్కడున్న నంది సర్కిల్ వైపు నుంచే వెళ్తాయి. అక్కడ దిగి కపిలతీర్థం వెళ్ళవచ్చు.  

ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ఈ జలపాతం సౌందర్యం కనులకు విందే. అంతెత్తునుంచి హోరుమంటూ ఉబికే జలపాతం సుందర దృశ్యాలు చూపుతిప్పుకోనివ్వవు. ఈ  ప్రశాంత వాతావరణం అడుగు కూడా కడపనివ్వదు. ఇదిగో ఇక్కడ చూడండి హోరుమంటూ జాలువారుతున్న ఆ జలపాత అందాలనుంచి చూపి తిప్పుకోగాలమా... ఎంతసేపైనా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా.

తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంలోను, శివరాత్రి సందర్భంగాను శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం కూడా వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ వినాయక ఉత్సవాలు, కార్తీకమాస ఉత్సవాలు దేవి నవరాత్రలు, కామాక్షిదేవి చందన అలంకారం అత్యంత విశేషంగా వైభవంగా జరుగుతాయి.

  


         ఈ కపిలతీర్థం మహిమను గురించి సాక్షాత్తూ శ్రీనివాసుడే వకులమాతతో చెప్పినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి.  పద్మావతి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడడానికి వెళ్తున్న తల్లి వకులమాతతో,  అమ్మా నీవు ముందు కపిలతీర్థం  లో స్నానం ఆచరించి కపిలేశ్వరున్ని దర్శించి ఆ తర్వాతే  నారాయణవనం వెళ్ళి మా వివాహం విషయం మాట్లదు అలా చేస్తే శుభం జరుగుతుంది అని చెప్పాడట శ్రీనివాసుడు. దీన్ని బట్టే ఈ కపిలతీర్థం ఎంత పవిత్రమైనడి అన్న విషయం అర్థమవుతుంది.

కార్తీక మాసంలో ఈ కపిలేశ్వర ఆలయాన్ని అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. కపిలతీర్థం కపిలేశ్వరసామి ఆలయంలో కార్తీక పున్నమ రోజున విశేషపూజలు జరుగుతాయి. ఆరోజున ఈ కపిలతీర్థంలో స్నానం చేసి శివదర్శనం చేసినవారికి జీవితంలో శాంతి, లభిస్తుందని మరణానంతరం  ముక్తి లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.

 

కార్తీక పౌర్ణమి మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయన్నది పురాణ వచనం. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ ప్రక్షాళన అవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ తీర్థంలో స్నానం చేసి ఎ చిన్న దానం చేసినా అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి తండోపతండాలుగా తరలి భక్తులు వస్తుంటారు. కార్తికంలో నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసేవారితోను  పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపారాధనలు చేసేవారితోను కళకళలాడుతూ కైలాసశోభతో వెలిగిపోతుంది.

      తీర్థయాత్రలతో పాటు ఒక మంచి పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలంలో కుటుంబంతో సహా వెళితే.. పుణ్యం.. పురుషార్థం అన్నట్టుగా ఇటు ఆధ్యాత్మికంగాను, అటు పర్యాతకంగాను కూడా చక్కగా ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది.

      తిరుపతి బస్టాండు నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఆలయం ఉంది. తిరుపతి బస్ స్టాండ్ నుండి కపిలతీర్థానికి టిటిడి బస్సులు తిరుగుతుంటాయి. ఇందులో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా ప్రైవేటు వాహనాలు,ఆటోలూ ఉంటాయి. మదనపల్లి, చిత్తూరుల నుంచి తిరుపతి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి. ఇక్కడ దిగి కపిలతీర్థాన్ని చేరుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు , అన్నప్రసాడం , తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి , ...