23, మార్చి 2024, శనివారం

జమదగ్ని నుంచి అలెగ్జాండర్ వరకు / malana village mystery himachal pradesh /most mysterious village in india

 

అదో మర్మగ్రామం! అద్భుతమైన అందాల లోకం! భూలోక స్వర్గంలాంటి పర్యాటక ప్రదేశం! ఓ పాత సినిమాలో చెప్పినట్టు వారాల పేర్లే అక్కడ మనుషుల పేర్లు!

మహర్షి జమదగ్ని నుంచి గ్రీకువీరుడు అలెగ్జాండర్ వరకు సంబంధమున్న గ్రామం.

అది భారతదేశంలో ఓ భాగమే. కాని ఆ గ్రామ వాసులు భారతీయ నియమ నిబంధనల కంటే తమ ప్రత్యేకమైన నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాల ప్రకారమే జీవిస్తారు.

ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవీ వాళ్లకు పట్టవు అలాగని వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు. కాని తమకే తమకు మాత్రమె ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం తు.చ. తప్పకుండా పాటిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక స్కూల్ తప్ప ప్రభుత్వానికి సంబంధించి ఇంకేవీ ఉండవక్కడ. అప్పుడెప్పుడో కోర్ట్ కూడా ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. కాని అందులే కేసులే ఉండవు. 1987 లో అక్కడే కర్దార్ అంటే వారి పెద్ద ఓ కేసును కోర్టుకు తీసుకు వెళ్ళాడు, కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది. కాకపొతే ఆ తీర్పును గ్రామస్తులు పాటించలేదు సరికదా ఆ కోర్ట్ కు వెళ్ళిన పెద్దనే ఊళ్లోనుంచి వేలేసారట అక్కడి వారు.



అక్కడి ప్రజలు స్వేచ్చ, స్వతంత్రాలకు మారుపేరుగా ఉంటారు. అయితే అది విచ్చలవిడితనం మాత్రం కాదు. ఆ గ్రామస్తులు చాల నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలీ అంటే ఈ ప్రపంచానికి దూరంగా భవబంధాలకు అతీతంగా ఎవ్వరితోను సంబధంలేని ఓ రహస్య దీవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడిలా ఎత్తైన కొండలమధ్య, అందాల లోయలో ఉంటుంది మర్మగ్రామం “మలానా”.

ఇంతకీ ఈ మలానా గ్రామ మర్మమేంటి. ఇదెక్కడుంది...? ఆ కథా కమామిషేంటి?

దేవభూమిలో మర్మగ్రామం మలానా

దేవభూమి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో  అందానికే మరోపేరయిన పార్వతీ లోయను ఆనుకొని ఉంది మలానా గ్రామం. సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో ఉన్న పార్వతి లోయలో  పచ్చని, మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం మలానా.



మలానా అంతా ప్రత్యేకమే... వీరు మాట్లాడే భాష దగ్గర్నుంచి వేషం వరకు, జీవన విధానం  దగ్గర్నుంచి పెట్టుకునే పేర్ల వరకు అంతా డిఫరెంట్. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని భాష వీరు మాత్రమే మాట్లాడే వీరి భాష కనషీ భాష. తమ భాషను చాలా పవిత్రంగా చాలా పవిత్రమైందిగా భావిస్తారు మలానా గ్రామ ప్రజలు. అందుకే ఈ భాషను ఎవ్వరికీ బోధించరు వీరు. అందుకే కాస్త సంస్కృతం, కాస్త ఇతర భారతీయ భాషలు, ఇంకాస్త టిబెటన్, మరికాస్త కిన్నెరీ, గ్రీకు భాషల కలగలుపుగా ఉండే ఈ భాష మీద చాలా అధ్యయనాలు కూడా జరుగుతున్నాయట. వీరుండేది మన దేశంలోనే కాని మన ప్రభుత్వ విధి విధానాలేవీ వీళ్ళకు పట్టవు. వీళ్ళకంటూ స్వంతంగా ప్రత్యేకమయిన నియమ నిబంధనలు, చివరకు న్యాయ వ్యవష్టను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఊరందరిదీ ఒక దారయితే ఉలిపికట్టెది ఓ దారి అంటుంటారు చూడండి అలా ఉంటుందన్నమాట ఈ గ్రామం. అలా అని ఇదేదో ఓ సాధారణ వింత గ్రామం అనుకోకండి. దీని వెనక పెద్ద చరిత్రే ఉంది.



జమదగ్ని రుషి నుంచి అలెగ్జాండర్ వరకు

జమదగ్ని రుషి దగ్గర్నుంచి విశ్వవిజేత కాబోయి కొద్దిలో ఆగిపోయినా అలేగ్జాండర్ వరకు ఈ గ్రామనతో సంబంధం ఉన్నవారే. ముందుగా జమదగ్ని రుషి ఈ గ్రామంతో సంబంధమేంటి అన్నది తెలుసుకొని తరువాత అలెగ్జాండర్ విషయానికి వద్దాం.

     ఓసారి జమదగ్ని మహర్షి పరమేశ్వరుడి గురించి కఠినమయిన తపస్సు చేసాడు. ఆ తపస్సు కు మెచ్చిన భోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అనడిగాడు. ప్రకృతి ఒడిలో కూర్చున్నంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని ఇవ్వు తపస్సు చేసుకుంటాను అనడిగాడు జమదగ్ని. అప్పుడు హిమాలయల్లో ఈ మలానా గ్రామాన్ని సృష్టించి ఇచ్చాడట శివుడు.

      సరే ఆ విషయాన్ని అలా ఉంచితే ఎక్కడో గ్రీకు దేశపు అలెగ్జాండర్ కి ఈ గ్రామంతో సంబంధమేంటి?

     మలానా వాసులు అలెగ్జాండర్ వారసులా!?

               విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నే జయించుకుంటూ భారతదేశంలోకి అడుగుపెట్టిన సందర్భంలో చాలా ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకున్న తరువాత ఒక సమయంలో ఒక సమయంలో అలెగ్జాండర్ వెనుతిరగక తప్పని పరిస్తితి ఏర్పడింది అలెగ్జాండర్ కి. ఆ పరిస్తితిలో కొంతమంది సైనికులు ఈ ప్రాంతంలోనే ఉండిపోయారని అదే మలానా గ్రామమని చెప్తారు. వారి సంతతి వారే ఈ మలానా గ్రామంలో తరతరాలుగా జీవిస్తున్నట్టు చెప్తారు. అయితే అలెగ్జాండర్ సైనికుల వారసులు మలానాలో కాదు, పాకిస్తాన్‌లోని కలాష్ లోయ సమీపంలో  ఉన్నారు అని మరో వాదన కూడా వినబడుతుంది.

       ఇక ఈ మలానా గ్రామానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పార్వతీ లోయకు ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కాని ఆ సమీపంలోనే ఉన్న ఈ గ్రామంలోకి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. బయటివారిని ఎవ్వరినీ వీరు తమ గ్రామంలోనికి రానివ్వరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారు శిక్షలు, ఫైన్ లు కూడా అనుభవించాల్సి ఉంటుంది.

      మలానా లోయలో మహిమాన్విత మైన ఔషధాలున్నాయని చెప్తారు. ఓసారి అనారోగ్యానికి గురైన అక్బర్ చక్రవర్తికి ఎవరో మలానాలో ఉన్న ఔషధ వనాల గురించి చెప్పారట. దాంతో ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఔషధాలు వాడి స్వస్థత పొందాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. అయితే ఇలాంది కథనాలు విని ఎవ్వరైనా అక్కడికి వెళ్లి ఆ మొక్కల మీద చెయ్యి వేస్తే మాత్రం అస్సలూరుకోరట మలానా గ్రామ ప్రజలు.  



         గ్రామంలో సొంత న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు వీరు. కౌన్సిల్‌లో ఉండే పదకొండుమంది సభ్యులతో ఒక కౌన్సిల్  ఏర్పాటు చేసుకొని ఆ కౌన్సిల్ ద్వారా పాలనా వ్యవహారాలు నిరహించుకుంటారు. ఆ కౌన్సిల్  సభ్యులను తమ గ్రామ దేవత ‘జంబ్లూ’కి  ప్రతినిధులుగా భావి స్తారంతా. అలాగే గ్రామంలో న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దిగువ న్యాయస్థానం, ఎగువ న్యాయస్థానం ఉంటాయి. దిగువ కోర్టులో న్యాయం జరగలేదంటే ఎగువ కోర్టుకు వెళ్లొచ్చు. భారతదేశంలోనే ఉన్నా తమకంటూ ప్రత్యేకమైన ప్రక్రియతో ఉంటారు మలానా వాసులు. తమ గ్రామానికి చెందని వారిని వివాహం చేసుకోరు. తమ గ్రామానికి చెందని వ్యక్తులు చేసే వంటకాలను వీరు స్వీకరించరు.  అబ్బో ఇంకా చాల చాలా ఉంటాయి. ఇక అక్కడున్న వారి పేర్లయితే మరీ ప్రత్యేకం. పుట్టిన రోజును బట్టి పేర్లు పెడతారు. ఆదివారం పుట్టినవారికి అహ్త అని, సోమవారం పుట్టిన వారికి సౌనరు అని, మంగళవారం పుట్టిన వారికి మంగల్ అని... ఇలాంటి పేర్లే పెడతారు. దాంతో ఒకే పేరు గలవాళ్లు చాలామంది కనిపిస్తూ ఉంటారు. జీవన విధానం దగ్గర్నుంచి న్యాయవ్యవస్థ వరకు ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండడంతో మలానాని కొందరు ‘ద రిపబ్లిక్ ఆఫ్ మలానా’ అని కూడా పిలుస్తుంటారు. ఇది మర్మగ్రామం మలానా కథ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు , అన్నప్రసాడం , తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి , ...