29, మార్చి 2024, శుక్రవారం

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు, అన్నప్రసాడం, తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి, మలహోరా, మిరియాల ప్రసాదం, నేతి పొంగలి, జిలేబి, మురుకులు ,లడ్డూ, వడ, పాయసం, బొబ్బట్లు అబ్బో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో. అయితే ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో. ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పించినా ఆ వెంకటేశ్వరునికి మాత్రం వీటన్నిటి కంటే ఒక్క నైవేద్యం మాత్రం అత్యంత ప్రీతిపాత్రమైనడట. అందుకే ఈ నైవేద్యాలన్నీ కులశేఖర పడి దగ్గరనుంచే శ్రీనివాసునికి సమర్పిస్తే ఈ ఒక్క నైవేద్యం మాత్రమె కులశేఖర పడి దాటి శ్రీనివాసుని సన్నిధిలో స్వామికి నివేదన చేస్తారట. మరి ఆ ఒక్క నైవేద్యం ఏంటి. ఆ నైవేద్యానికి ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాం..



         తిరుమల వేంకటేశ్వరునికి ''ఓడు'' అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని ''మాతృ దద్దోజనం'' అంటారు 

                ఓడు అంటే పగిలిన మట్టి కుండా అని అర్థం. ఆ పగిలిన మట్టికుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు. కలియుగ ప్రత్యక్షదైవం, లక్ష్మీవిభుడు, అత్యంత ధనవంతుడైన శ్రీ వేంకటేశ్వరునికి పగిలిన కుండలో నైవేద్యమా... ఆశ్చర్యంగా ఉంది కదూ... అవును పగిలిన మట్టికుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు... ఎందుకలా! సాక్షాతూ లక్ష్మీవల్లబుడైన శ్రీవారికి వెండి బంగారాలకు కొదవా... మణిమాణిక్యాలకు కొదవా... మరి ఆ శ్రీవారికి  పగిలిన కుండలో  పెరుగన్నం సమర్పించాడమేంటి? ఆ నైవేద్యం శ్రీవారికి అంట ప్రీతిపాత్రమైనదెలా అయింది... ఆ కారణమేంటి? చూద్దాం...

          తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి ప్రియమైనభక్తుడు… వేంకటేశ్వరుని మామగారైన ఆకాశారాజుకి తమ్ముడు.  శ్రీ వేంకటేశ్వరునికి చిన్న మామగారు. శ్రీవారిని నిత్యం బంగారు పూలతో అర్చించేవాడు. అయితే తొండమానుడికి, తానే శ్రీవారికి గొప్ప భక్తుడినని విపరీతమైన గర్వం ఉండేది. ఇలాంటి సమయంలోనే తాను బంగారు పుష్పాలు పెట్టి స్వామికి పూజ చేసి వెళ్ళిపోయేవాడు. అయితే తాను మళ్ళీ స్వామి పూజకు వచ్చేసరికి స్వామి దగ్గర తాను పూజించిన బంగారు పుష్పాలకు బదులు మట్టి పుష్పాలు కనిపించేవి. ఏంటీ విపరీతం ... తాను బంగారు పుష్పాలతో పూజ చేస్తే ఈ మట్టిపూలు ఎలా వస్తున్నవి అని చింతించాడు.

      అయితే శ్రీవేంకటేశ్వరుడు ఓ రాజా! ఇవి నిస్వార్ధంతో, నిష్కలంకమైన భక్తితో పూజించే కుమ్మరి భీమన్న సమర్పించిన పుష్పాలు అని చెప్పాడు. అతని నిష్కళంకమైన భక్తి కారణంగా మట్టి పుష్పాలైనా అవి నా చెంతకు చేరాయి అని చెప్పాడు.

ఆ కుమ్మరి నాకంటే భక్తుడా! నేను సమర్పించే స్వర్ణ పుష్పాలను కూడా పక్కక్ నెట్టేవిధంగా నాకంటే గొప్ప భక్తుడా!  అని అహంకారంతో అడిగాడు తొండమాన్ చక్రవర్తి.  సరే అతని భక్తిని నువ్వే స్వయంగా చూడు అని కుమ్మరి భీమన్న ఇంటికి తొండమాన్ ని తీసుకొని వచ్చారు శ్రీవారు. వారిని చూసి సాదరంగా ఆహ్వానించాడు భీమన్న. ఆ కుమ్మరి భీమన్న నిత్యం శ్రీవారి కైంకర్యాలు కొరకు కుండలను అందించేవాడు. నిత్యం స్వామి సన్నిధికి వెళ్లి పుష్పాలతో అర్చించే సమయం అవకాశం లేని కుమ్మరి భీమన్న, తన వృత్తి పని చేసుకుంటూనే తాను పని చేసుకుంటున్న చోటే స్వామి వారి ప్రతిమను ఏర్పాటు చేసుకొని తన ఇంటివద్దనే పూజించేవాడు. కుండలు తయారుచేయ్యగా మిగిలిన చేతికంటిన మట్టితో పుష్పాలను చేసి స్వామికి అర్పించేవాడు.  అతని భక్తి కారణంగా ఆ మట్టి పుష్పాలు శ్రీవారి ఆలయంలో స్వామి సన్నిధికి  చేరేవి.

          తన ఇంటికి వచ్చిన శ్రీవారికి తన శక్త్యానుసారం  ఒక కుండపెంకు లో పెరుగన్నం సమర్పించాడట కుమ్మరి భీమన్న. ఆ నివేదన తనకెంతో ఇష్టమైనదిగా భావించారట స్వామివారు. దాంతో కుమ్మరి భీమన్న శ్రీవారికి సమర్పించిన నైవేద్యానికి సూచనగా  ఓ కుండను తీసుకోని మీద భాగం వరకు పగులగొట్టి… క్రింది భాగంలో ఆకూ వేసి ప్రసాదాలు వడ్డించి… కుండ మెడభాగాన్ని క్రింద ఉంచి నివేదన చేసే వారు. కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులలో గంగాళాలు అందుబాటులోకి రావడంతో ఓడు వినియోగం తగ్గింది. కానీ ఇప్పటికే కూడా  శ్రీవారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని మాత్రం ఓడు ప్రసాదంగానే పిలుస్తారు. స్వామి వారికి ఇంత ప్రీతిపాత్రమైన నైవేద్యం కాబట్టే మిగిలిన అన్ని ప్రసాదాలు కులశేఖర పదికి ఈవలె పెట్టి స్వామికి నివేదన చేస్తే ఈ ఓడు నైవేద్యం మాత్రం స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది. ఇదీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఓడు నైవేద్యం వెనకున్న కథనం.

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు , అన్నప్రసాడం , తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి , ...